ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు ఆమె తెలిపారు. గన్‌పార్క్ వద్దకు చేరుకున్న ఆమె ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కులం పేరుతో గత కొన్నేళ్లుగా అవమానించి మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని తాజాగా తనను హనీమూన్ అనే పదంతో దూషించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు రాజకీయాల్లోకి వస్తే ప్రోత్సహించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు, కులంతో దూషించడం చేసి మనోవేదనకు గురి చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే సుధీర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని, త్వరలో శిక్ష కూడా పడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. దీనిపై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన్ను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీస్ జారీచేసింది.








