సంబరాల మూడ్ నుంచి బయటకు రండి.
*సీఎం విజయ్ సర్కారుపై అణ్ణామలై తీవ్రస్థాయిలో ధ్వజం.
*మదురై, కోయంబత్తూరు దారుణాలతో అట్టుడుకుతున్న తమిళనాడు.
* ఇది తమిళనాడా? ఉత్తరప్రదేశా? అని ప్రశ్నించిన ఉదయనిధి స్టాలిన్.
చెన్నై, మహా.
తమిళనాడులో నూతనంగా కొలువుదీరిన ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం అప్పుడే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పార్టీ అధికారంలోకి వచ్చి పక్షం రోజులు కూడా గడవకముందే రాష్ట్రంలో చిన్నారులపై జరిగిన రెండు దారుణ ఘటనలు అధికార పార్టీని తీవ్ర ఇరకాటంలో నెట్టాయి. ఒకవైపు ఎన్నికల విజయానందంలో టీవీకే ప్రభుత్వం ఉండగా, వరుస దారుణాలు రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయంటూ ప్రతిపక్షాలు ముప్పేట దాడికి దిగాయి. ముఖ్యంగా బీజేపీ నేత కే. అణ్ణామలై, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్లు ముఖ్యమంత్రి విజయ్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మదురైలోని సుప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడిని ఐదుగురు సభ్యుల ముఠా దారుణంగా హత్య చేసింది. మరోవైపు కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలో పదేళ్ల బాలికపై లైంగిక దాడి, దారుణ హత్య ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఘటనలపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అణ్ణామలై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. “రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకు, అఘాయిత్యాలకు పాల్పడేవారికి, హంతకులకు పూర్తి స్వేచ్ఛ దొరికింది” అని ఆయన ఘాటుగా విమర్శించారు. “గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్ నుంచి బయటకు రాలేదని, తక్షణం వేడుకలు ఆపి క్షేత్రస్థాయిలో ఉన్న భయంకరమైన వాస్తవాలను ముఖ్యమంత్రి గమనించాలని ఆయన హితవు పలికారు.
మరోవైపు శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సైతం ప్రభుత్వ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారుల రక్షణపై ఎన్నికల ముందు ఎన్నో పౌరుష పదాలు మాట్లాడిన విజయ్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. గత పదిహేను రోజుల్లోనే రాష్ట్రంలో 25 హత్యలు, 19 లైంగిక దాడులు జరిగాయని ఆరోపించిన ఆయన.. “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశా?” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సైతం ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, శాంతిభద్రతలను కాపాడటంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
వరుస ఘటనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అత్యంత కఠినంగా అణచివేయాలని, ఇలాంటి కేసుల విచారణను వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని పోలీసు శాఖను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయాలంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. ఆదివారం నాడు కోయంబత్తూరు చిన్నారి కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే కేవలం పదిహేను రోజుల పాలనలోనే విజయ్ సర్కారు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.







