Mahaa Daily Exclusive

  హమాస్ కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా…

Share

హమాస్ కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా.
• ఇజ్రాయెల్‌తో చర్చల్లో కీలక పాత్ర పోషించిన నేతకు బాధ్యతలు.

గాజా సిటీ, మహా.
పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ కొత్త రాజకీయ బ్యూరో అధినేతగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నికయ్యారు. సంస్థలో నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో మాజీ రాజకీయ బ్యూరో చీఫ్ ఖలీద్ మేషాల్‌పై విజయం సాధించినట్లు హమాస్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. యహ్యా సిన్వర్ మరణం అనంతరం తాత్కాలికంగా ఏర్పాటైన ఐదుగురు సభ్యుల నాయకత్వ మండలిని రద్దు చేసి, పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలను ఖలీల్ అల్ హయ్యాకు అప్పగించినట్లు వెల్లడించింది.

యహ్యా సిన్వర్, అంతకుముందు ఇస్మాయిల్ హనియె మరణాల తర్వాత హమాస్ కార్యకలాపాలను ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక నాయకత్వ మండలి నిర్వహించింది. ఆ మండలిలో ఖలీల్ అల్ హయ్యా కీలక సభ్యుడిగా వ్యవహరించారు. ఇజ్రాయెల్‌తో పరోక్ష కాల్పుల విరమణ చర్చలు, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో హమాస్ ప్రధాన చర్చల ప్రతినిధిగా ఆయన కీలక పాత్ర పోషించారు.

అంతర్గత ఎన్నికల అనంతరం తాత్కాలిక మండలిని రద్దు చేసి, ఖలీల్ అల్ హయ్యాను హమాస్ రాజకీయ బ్యూరో అధినేతగా ఎన్నుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఎన్నికతో హమాస్‌లో నాయకత్వానికి సంబంధించిన అనిశ్చితి ముగిసినట్లు భావిస్తున్నారు. అంతర్గత ఎన్నికల్లో అల్ హయ్యా స్వల్ప తేడాతో ఖలీద్ మేషాల్‌పై విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

1960లో గాజాలో జన్మించిన ఖలీల్ అల్ హయ్యా హమాస్‌లో సుదీర్ఘకాలంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంస్థలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన, గత కొన్నేళ్లుగా హమాస్ నిర్ణయాత్మక వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కాల్పుల విరమణ, బందీల మార్పిడి చర్చల్లో ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో జరిగిన పలు సంప్రదింపుల్లో హమాస్ తరఫున ప్రధాన ప్రతినిధిగా పాల్గొన్నారు.

కొత్త నాయకత్వంతో హమాస్ భవిష్యత్తు వ్యూహం, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఘర్షణలు, కాల్పుల విరమణ చర్చలు, గాజా పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.